ఆదిశేషు, ఉదయభాస్కర్ అన్నదమ్ములు కాకున్నా అలాగే కలిసిమెలిసి వుంటారు. అందుకు అనేక కారణాలు. ఇద్దరిది ఒకేసామాజికవర్గం,ఒకే వృత్తి, ఒకేబాషాపాండిత్యం,ఒకేప్రాంతం….కానీ …ఆదిశేషు మాటకారి, పనిమంతుడు, కార్యసాధకుడు, ఎంతటివారినైనా ఇట్టే పట్టేయగల చమత్కారి, ఆఫీసు పనులను అలవోకగా ఆచరించగల అసాధ్యుడు. ఉదయభాస్కర్ సాదాసీదా మనిషి. ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయటం, తన పనేదో తాను చూసుకునేమనిషి.

ఇద్దరు ఒకరినొకరు ‘అన్నా‘అని సంభోదించుకోవటం అలవాటు. ఆదిశేషు తనచాతుర్యంతో, మాటకారి తనంతో ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ పోస్ట్ సంపాదించి, ఆఫీస్ పనులు చక్కబెడుతూ , అందరికి తలలో నాలుకలాగవుంటూ , తద్వారా అంతోఇంతో లాభం పొందుతూ నిచ్చెన మెట్టు ఒక్కొక్కటే ఎక్కుతూ పైపైకి పోతున్నాడు. ఉదయభస్కర్ మాత్రం తాను స్వంతంగా చిన్న పాఠశాల ప్రారంభించి తనజీవన సాఫల్యాన్ని వెతుక్కుంటున్నాడు.

రోజులు, నెలలు, సంవత్సరాలు …… అలాగడిచి పోయాయి. మనిషి జీవితంలో జరగాల్సిన అన్ని ప్రక్రియలు జరిగిపోయాయి.రిటైర్మేంటు రోజుకూడా వచ్చింది.ఆదిశేషు ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యాడు. ఆరోజు అందరూ ఘనంగా సత్కరించారు.ఇంద్రుడు చంద్రుడు అని పొగిడారు. మేళతాళాలతో ఇంటివరకు ఊరేగించారు. శాలువాలు, పూలమాలలు, అభినందనలు ఇంటినిండా నిండిపోయాయి. ఆరాత్రి ఆదిశేషు సంపూర్ణ ఆనందం తో నిద్రపోయాడు.

మరుసటిరోజు నుండి ప్రారంభ మయ్యాయి ఆదిశేషు కష్టాలు. రిటైర్మెంట్ చివరి నెల జీతం రెండులక్షల ఇరవై వేలు.పెన్షన్ కేవలం లక్ఞాముప్పయి వేలు. అంటే ఈరోజు నుంచి ఇంత నష్టం ఎలా పూడ్చాలి? ఈ ఆలోచనలతోటే అలవాటు ప్రకారం కాలేజికి వెళ్లాడు. తనప్రిన్సిపాల్ సీటు ఎవరినో వరించింది. మనసు చివుక్కుమనింది. కాలేజి ప్రాంగణం కలయతిరిగాడు. నిన్నటి లాగా లేదు కాలేజి. తనను ఎవరూ గుర్తించలేదు. నిన్నటి వరకు తన ఉనికి కనపడగానే అందరూ అలర్ట్ అయ్యేవారు. ఈరోజెందుకో తనకు తానే కొత్తగా కనిపిస్తున్నాడు. ఇంటికొచ్చాడు. భార్య చెవిలో సెల్ఫోన్ తో తనవునికినే మరిచిపోయుంది. పిల్లలు ఇద్దరు బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో వున్నారు.

ఓనెల అంటూ ఇటూ తిరిగాడు. తనగోడు పట్టించుకోనే నాధుడెవరా అని ఆలోచించాడు .
తరచి తరచి చూడగా గుర్తొచ్చాడు ఉదయ భాస్కర్. యస్. భాస్కరన్న ఒక్కడే ప్రస్తుతం నాకు దిక్కు అనుకున్నాడు.తనకంటే పెద్దవాడైనా తనను ‘అన్నా‘ అనే సంభోదిస్తాడు. తప్పక వెళ్లాలి. మనసు కుదుటపడుతుంది. భార్యతో అన్నాడు. ఆమె ఎగిరి గంతేసింది. కారణం ఆ ఊరిలోనే వాళ్లచెల్లెలు వుండేది.
ఉదయ భాస్కర్ తాను ప్రారంభించిన పాఠశాల లోనే తనపిల్లలను చదివించుకున్నాడు. పిల్లలు పెద్దవారయ్యారు. ఎవరిజీవనం వారు సాగిస్తున్నారు. పాఠశాల మూసేసి విద్యారంగంలో మార్పులకోసం పదిమందితో కలిసి పనిచేస్తున్నాడు. పాఠశాల నడిచిన చిన్న ప్రాంగణం అద్గెకిచ్చాడు. వచ్చేపదివేలతో కాలంగడుపుకుంటున్నాడు. ఊరిలోనైతే కాలినడక, పట్నం అయితే ఎర్రబస్సు.

ఆదిశేషుని స్వంత ఇల్లు ఆధునిక సౌకర్యాలతో కట్టుకున్నాడు. కారు కొన్నాడు. ఉదయ భాస్కర్ ను చూడడానికి స్వంతకారులోనే వచ్చాడు.
చాలారోజుల తరువాత మిత్రులు కలుసుకున్నారు. ఆనందంగా మాట్లాడుతూ మద్యలో ఆదిశేషుని తన మనసులోని బాధను బయటపెట్టే శాడు.
“భాస్కరన్నా! మనుషులెందుకు ఇట్లా వుంటున్నారు? మా కాలేజీలో కాఫీ కప్పులు కడిగే ఒకడిని అష్టకష్టాలు పడి క్లర్క్ పోస్ట్ ఇప్పించా. ఇప్పుడు అది మర్చిపోయి వాడి పెండ్లికి పదహైదురోజులు సెలవు అడిగితే పదిరోజులే ఇచ్చానని పంగిస్తాడు. ఉద్యోగం ఇప్పించిన విషయం గుర్తులేదు వాడికి. రిటైర్ అయిన తరువాత అస్సలు లెక్క చేయకుండా వున్నాడు.” అన్నాడు.
” శేషన్నా! ఉద్యోగం ఇప్పించింది ఎవరు? ”
” నేనే కాదన్నా”
” నువ్వా? ప్రిన్సిపాలా?”
“నేను ప్రిన్సిపాల్ ఒకటేగదన్నా?”
” ఇప్పుడు కాదుగదా శేషన్నా”
” అంటే ..రిటైర్ అవగానే మరిచిపోతారా? ”
” శేషన్నా! నువ్వు ఆదిశేషువన్నవిషయం మరచిపోయావ్. నువ్వే ప్రిన్సిపాల్ అనుకున్నావ్.అది కేవలం పోస్ట్ అన్నవిషయం మరచిపోయావ్.”
” బ్యాంక్ కు వెళితే నిన్నటివరకు లేచినిలుచుని స్వాగతం పలికిన వాళ్లు ఈ రోజు చూసికూడా చూడనట్లు నటిస్తున్నారెందుకు”
” నిన్నటివరకు వాళ్లకు డిపాజిట్లు ఇచ్చేది నీవద్దవున్న ప్రిన్సిపాల్ పోస్ట్. ఇప్పుడు నీతోవాళ్లకు ఏంపని చెప్పు”
” మా సహోద్యోగులు కూడా ఎవరూ కలిసి రారు, సరిగా మాట్లాడారు. పెన్షన్ ఆఫీస్ లోకూడా లెక్క చేయరు”
” శేషూ.. ఇన్నాళ్లూ నీమంత్ర దండాన్ని గౌరవించారు, ఇప్పుడది నీచేతులో లేదు. ”
” భాస్కరన్నా! చివరకు నా భార్య కూడా ఇరవై నాలుగు గంటలు ఫోన్ లో వాళ్ల అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ముల తో బాతాఖానీ వేస్తంది లేకుంటే సీరియల్స్ చూస్తుంది తప్ప నాగురించి పట్టించుకోదు.”
” అందరి భార్యలు అంతే శేషూ.. వాళ్ల సోషియల్ కాంట్రాక్టు పూర్తి అయినతరువాత వారి వారి అభిరుచులకు అనుగుణంగా వారుంటారు. భార్యగా , తల్లిగా,వారి బాద్యతను నెరవేర్చిన తరువాత స్వతంత్రులౌతారు.అంటే ‘భర్త‘ పోస్ట్ కూడా పోయినట్లే.”
” కనీసం కొన్నకొడుకైనా ప్రేమగా వుంటాడనుకుంటే……వాడుకూడా సరిగా మాట్లాడడు. కనీసం ఎప్పుడొచ్చావు అనికూడా అడగడు.”
” శేషూ..నీవు తండ్రి పోస్టులో వున్నప్పుడు ఎంత కృూరంగా ప్రవర్తించావో గుర్తు తెచ్చుకో! వాడు ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటానంటే నీబలాన్నీ, బలగాన్ని వాడిమీద ప్రయోగించి నీ పంతం నెరవేర్చుకున్నావ్. ఇప్పుడు వాడు వాడి నిరసన తెలియజేశాడు”
” నీకు తెలుసుగదన్నా మొదటి రోజుల్లో నాకు వచ్చిన తక్కువ జీతంతో నే వాళ్లను అంతపెద్ద చదువులు చదివించాలంటే…ఏంతో త్యాగం చేసి వుండాలి. అది గుర్తు రాలేదా వాళ్లకు”
” వాళ్లుచదవాలన్నది కాకుండా నీ ప్రిస్టేజి కొరకు నీఇష్టమొచ్చిన చదువే చదివించి ఇప్పుడు త్యాగమంటే ఎలా శేషూ! ”
” నా పిల్లలను నీపిల్లలకంటే మంచిగానే పెంచాం, చదివించా.మరి నీపిల్లలు నిన్ను బాగా తీసుకుంటున్నారా?”
” శేషూ.. నేనే నా పిల్లలను బాగాచూసుకుంటా. నాపిల్లలనేకాదు నాదగ్గర చదువుకున్న పిల్లలు, నాదగ్గరకు వచ్చేపిల్లలు అందరిని బాగా చూసుకుంటా.”
“ఇంకా పనిచేస్తున్నావా? ఈ వయసులో కూడా ? ”
“వయసు శరీరానికే కానీ మనసుకు కాదుగదా? ”
” నీకు ఒంటరి తనమనిపించదా?”
” ఒంటరితనాన్ని నేనెప్పుడూ అనుభవించలేదు. నాతో ఎవరు లేకున్నా నేను అందరితో వుంటా.”
” నాకెందుకో ఈఒంటరితనం”
“నీ అస్తిత్వాలైన బంధాలన్నీ ఒక్కొక్కటి తెగిపోతున్నాయ్. ఇన్నిరోజులు ఆ అస్తిత్వాలే నీవనుకున్నావ్.నీ పేరుకూడా మరిచిపోయి ఆ అస్తిత్వాలకు అంకితమయ్యావ్.అవేవి నీవుకాదు.ఆ పేరుకూడా నీవుకాదు.”
” మరి నేనెవరిని”
“ఆ పరిశోధన మీదనే వుండు. నీవెవరో నీకే తెలుస్తుంది.”