ఏదైనా సమస్య మూలాలలోకి వెళ్ళి ఆలోచిస్తే గానీ సమస్య ఏమిటో, ఎక్కడుందో అర్థం కాదు. సమస్య మూలాల్లోకి వెళ్ళి నప్పుడు ఆలోచించేవాడు , సమస్య వేరుగా వుండవు. “నా”, “నేను” “నాది” అన్న అహం తొలగి పోతుంది. సమస్య అర్థమవుతుంది. అంతరించి పోతుంది కూడా. అలా కాకుండా సమస్య వల్ల ఉత్పన్నమైన దాన్నే సమస్యగా తీసుకుని పరిష్కారాలు ఎన్ని సూచించినా తాత్కాలికంగా సమస్య అణగి పోతుందేగానీ అంతరించి పోదు. ఇంకో రూపంలో సమస్య తలెత్తుతుంది. అప్పుడు అది వేరే సమస్య అని మనం అనుకుంటాము. కానీ అది వేరే సమస్య కాదు. వాటిమూలాలు ఒక్కటే. కానీ అవి కనిపించే విధానాలు వేరుగా వుంటాయి. అప్పుడు మళ్ళీ ఇంకో పరిష్కారాన్ని కనుగొంటాము. తాత్కాలికంగా అది పరిష్కారం అవుతూవుంటుంది.

ఈ పిల్లల కొట్లాటకుఅసలు మూలకారణం చెన్నారెడ్డి సారుకు కనబడలేదు. ఒక పెద్దింటి పిల్లవాడిని పాళెంపిల్లవాడు అంత మాట అనడం , దాని వలన రాబోయే పరిణామాలు మాత్రమే ౘూశాడు. మా నాన్న మాత్రం సమస్య పిల్లలది కాదు . అది ” డెస్కుల ” సమస్య అని అర్థం చేసుకున్నాడు. అలా కాకుండా పరిష్కారంగా ఆ పిల్ల వాడికి టి.సి. ఇచ్చి పంపినా, లేక క్షమాపణలు చెప్పించినా సమస్య కు తాత్కాలిక ఉపశమనం కలిగి యుండేది. సమస్య ఇంకో రూపంలో వచ్చియుండేది. అప్పుడు ప్రతిసారీ ఒక్కడినే తప్పుపట్టడం బాగుండదు కాబట్టి నాలుగు సార్లు ప్రక్కవాడిని అంటే ఒక్కసారైనా నన్ను అనాల్సి వుంటుంది.

ఒక సమస్య మూలంలోకి వెళ్ళి ౘూడాలంటే , ౘూచే వాడిలో “నేను, నాది ” అన్నది వుండకూడదు. ఈ. ” నేను, నాది ” అను వ్యక్తిగత స్థాయిలో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాస్కృతిక, జాతీయ, కుల, మత, వర్ణ, భాష, ప్రాంతీయ స్థాయిలో వుండవచ్చు. అప్పుడు ఈ ” నేను, నాది ” సమస్య ఆవిష్కరింపబడిన విధానమునే ౘూడగలుగుతుంది గానీ సమస్య మూలాన్ని ౘూడదు. “నేను, నాది ” పైన చెప్పబడిన పరిధులలోనూ, లేదా అలాంటి సంకుచిత పరిధులలోనే సంచరిస్తుంది. అందుకే
” మూలం ” అందదు. ఒక సరళికి నిబద్దమైన మనస్సు మూలాన్ని చేరదు. అందుకే అప్పుడు ఈ సమస్య నాకు అర్థం కాలేదు. దానికి మా నాన్న గారిచ్చిన పరిష్కారం నచ్చ లేదు.

ఆ తరువాత నా అరవైయ్యవ యేట ” రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, నంద్యాల ” లో
” లైఫ్ స్కిల్స్ ” బోధకుడిగా చేరినప్పుడు ఈ సమస్యను బి.టెక్. విద్యార్థులతో చర్చించే వాడిని. అదేసమస్య కాకున్నా …. అలాంటిదే. అయితే అందరూ కూడా తమతమ నిబద్ధమైన ( Conditioned) మనస్సు తో ౘూచే వారు కాబట్టి సమస్య ఆవిష్కరింపబడిన దానిపైఞే పరిష్కారం వెతికేవారు. తరువాత మూలాల్లోకి ఎలా వెళ్ళి ౘూడా లన్నపుడు అది ఎంతనకష్టమో కూడా తెలిసేది వాళ్ళకు. ఏదో ఒక వైపు తీసుకుని ౘూడడం మనకు పరిపాటి, క్షేమకరం అని భావిస్తున్నాం
“ప్రాబ్లమ్ సాల్వింగ్ ” ఈ రోజుల్లో “ఒక గొప్ప కళ “. అయిపోయింది.

పాఠశాల ఈ ప్రాంగణంలో నడచిన కాలంలో కనీసం నెలకు రెండుమార్లయినా ” విందు భోజనం ” దొరికేది. అది అందరికీ కాదనుకో కేవలం బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే.

పలుగురాళ్ళపల్లె లో ” శుభ్రవీటివారు ” గొప్ప మనసున్న బ్రాహ్మణ కుటుంబం. వీరి ఇంటిలో అన్నదానం ఎప్పుడూ జరుగుతూ వుండేది. ” చేతికి ఎముక లేని కుటుంబం ” అంటూ వుండే వారు ప్రజలు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. శుభ్రవీటినారాయణ శాస్త్రులు, వారి సతీమణి సీతమ్మ గారు పాఠశాల విద్యార్థులకు సుపరిచితులు. ఎందుకంటే…. కనీసం నెలకు రెండైనా వీళ్ళింటిలో
“తిథులు” (తద్దినాలు) జరుగుతుంటాయి. తద్దినం రోజు బంధువులందరూ వస్తారు. బ్రాహ్మణ అగ్రహారం కాబట్టి అందరూ ఏదో ఒక రకంగా బంధువులై వుంటారు. తద్దినం రోజు వంటకూడా
” అపరాహ్న ” సమయంలోనే అంటే మధ్యాహ్నం( పన్నెండు గంటల)
తరువాత మొదలుపెట్టి తతంగమంతా అయ్యేటప్పటికి సాయంత్రం ఆరుగంటలయ్యేది.

శుభ్రవీటి నారాయణశాస్త్రులు పాఠశాల లోని ప్రతి క్లాసుకు సాయంకాలం చివరి పీరియడ్ లో వచ్చి ” ఈ రోజు బ్రాహ్మణ పిల్ల లందరూ భోజనానికి రావాలి ” అని ప్రకటన చేసేవారు. టీచర్లయితే … ఇంకేం .. ఫుల్ భోజనం దొరికింది తప్పక పోయిరాండి అని పర్మిషన్ ఇచ్చేవారు. అలా ప్రతినెలా తప్పకుండా కనీసం రెండు సార్లు ” విందు భోజనం ” దొరికేది. ఈ శుభ్రవీటివారి ఆడపడుచే ” గురుగోవింద స్వాముల” వారి సతీమణి.