ఆరు క్లాసు రూములు వచ్చాయి. ఎదురుగా ಓ ఇరవై గజాల వెడల్పున వందగజాల పొడవున ఖాళీస్థలం మిగిలింది. తర్వాత సత్రంను ఆఫీసు రూముగా మార్చుకున్నారు. దీనికి వెనుక వరండా కూడా ఉండేది కాబట్టి ఉపాధ్యాయులకు విడిదిగా కూడా ఉపయోగ పడేది. ఈ సత్రం వెనుక గూడా వందగజాల పొడవున ఇరవై గజాల వెడల్పు న మామిడి చెట్లతో నిండిన స్థలం వుండేది. ఉదయం అస్సెంబ్లీకి ” వాలీబాల్ ” ఆడటానికి , కబడ్డీ, కో..కో.. లాంటివి ఆడటానికి వాడుకునేవారు. ఈ స్థలానికి ఆనుకుని ౘాలా పెద్ద మామిడి తోట వుండేది. ఈ మామిడి తోట మాత్రం పాఠశాలకు సంబంధించినది కాదు. కానీ విద్యార్థులు ఈ ౘల్లని చెట్లక్రింద కూర్చుని పరీక్షలకు ౘదువుకునే వారు.

ఈ పాఠశాల ప్రాంగణం ప్రక్కనే ఒక చిన్న కాలువ పారుతూ వుండేది. చెరువు అలుగు ( మొరవ )దగ్గఱ లో వుంది కాబట్టి చెరువు నిండి అలుగు ( మొరవ ) పారినన్ని రోజులు ఈ కాలువ జీవనదిలా పారుతుండేది. ఇక్కడ రెండు చిన్న భావులు ఎప్పుడూ నీళ్ళతో నిండుగా ఉండేవి. ಓ యాభైవరకూ మామిడి చెట్లు పెద్ద పెద్ద గా పెరిగి వుండేవి. అందులో ఒక చెట్టు ” కొబ్బరి మామిడి ” చెట్టు. ఈ చెట్టు కాయలు బలే రుచిగా వుండేవి . అయితే సామాన్యంగా ఎవరికీ దొరికేవి గాదు. ఇక పాఠశాల వెనుకభాగాన,వరిమళ్ళను ఆనుకుని “బెంగుళూరు మామిడి చెట్లు వుండేవి. ఈ చెట్లన్నింటికీ యజమాను లెవరో తెలియదు . కానీ కాపలా దారు లందరూ ముస్లిం సోదరులే .

మామిడి చెట్లు చిగురించే సమయానికి ఎక్కడనుండి వస్తాయో కోయిల గుంపు చెట్లనాశ్రయించి ఉదయం నుండి ప్రొద్దు పోయేవఱకు ” కుహూ…కుహూ” అని కచేరీ చేస్తూనే వుంటాయి. అప్పుడప్పుడూ అవి అలసిపోయి కూయకుంటే పిల్లలు వాటి కూత ననుకరిస్తూ వాటిని రెచ్చగొట్టడంతో అవి మళ్ళీ ” కుహూ…కుహూ”
రావాలతో సందడిచేస్తాయి.

మామిడి పూత సమయంలో “ఘుమ్మ ” ని
వాసన, “ఝమ్మ” ని భ్రమర (తుమ్మెద) నాదం ఎంతో ఆహ్లాదంగా వుండేది. రాలిన పూత రాలి పోగా , పూత పిందెగా మారేసమయంలో కోతుల బెడద బాగా వుండేది. వాటిని తరమడానికి కాపలా దారులు చెట్లపైన మంచె కట్టుకునేవారు. కొందరైతే నులక మంచాన్ని తిరగేసి నాలుగు వైపులా కొమ్మలకు మంౘం కోళ్ళను బిగించి డబ్బాలను వాయిస్తూ శబ్దం చేస్తూ కోతులను తోలే వాళ్ళు. ఈ మంచెలు దాదాపు వంద అడుగుల ఎత్తున కట్టుకునే వారు. అన్నంకూడా పైకే తెచ్చుకుని తినేవారు. ఉదయం ఎక్కితే చీకటి పడిన తర్వాత కానీ దిగేవారు కాదు.

ఆరోజుల్లో రాలిన పిందెలను కూడా ఏరుకుని అమ్మేవాళ్ళు కొంచం పెద్దపిందెలయితే ” ఉడుకూరగాయ” పెట్టేవారు. పిందెలు కొంచం మగ్గించి ఉప్పూ కారం ౘల్లి నూనె కలిపేవారు,అంత పుల్లగా లేకున్నా కొంచం వగరుగా వున్నా అదో రుచిగా వుండేది. కానీ మా విద్యార్థులకు అంత అవసరముండేది కాదు. సుమారైన పిందె దొరికిందంటే రెడీగా వుంౘుకున్న ఉప్పు కారం నంజుకుని లాగిసంచే వాళ్ళం.

ఏప్రిల్ 23 వఱకు పాఠశాలల పనిదినాలు వుంటాయి కాబట్టికాయలన్నీ పక్వానికి వచ్చియుంటాయి అప్పు డప్పుడూ ఒకటి రెండు కాయల రాలుతూనే వుంటాయి. పిల్లలు ఏరుకుని తింటూనే వుంటారు. ఏప్రిల్ నెలలో పరీక్ష ల సమయం సిలబస్ అయిపోయి వుంటుంది. ౘదివింౘడం ” మాడల్ పరీక్షలు ” పెట్టడం
జరుగుతూ వుంటుంది. ౘదువుకునే టప్పుడు, పరీక్ష రాసేటప్పుడు ఎవరంతకు వారు ఏదో ఒక చెట్టు క్రింద కూర్చుని పని చేసుకుంటూ
వుంటారు. అదృష్టం ఉంటే చిలక కొట్టిన మామిడి పండు పడవచ్చు . దాని రుచి వర్ణనాతీతం. శలవుల తరువాత జూన్ నెలలో వచ్చి నప్పుడు కూడా చెట్లు ” ఈటు” పోయినప్పటికీ అక్కడొకటి అక్కడొకటి కాయలు మిగిలి పోయి రాలుతూ వుండేవి. ఎవరి అదృష్టం వారిది.