ఆ విధంగా ఎనిమిదవ తరగతి పూర్తయింది. ఇప్పుడు మా స్కూలు ఎండాకాలం సెలవుల తర్వాత. ప్రారంభిస్తే…. సంపూర్ణ పాఠశాలగా వుంటుంది. అంటే ఆరవక్లాసు నుండి SSLC వరకు, అంటే ఆరు క్లాస్ రూములు, ఒక ఆఫీసు రూము కావాలి. ప్రస్తుత మున్న ఆవరణం సరపోదు. అందుకే క్రొత్త స్థలం కోసం ఎదురు ౘూస్తున్నారు. అందరూ చర్చలు ౙరుపుౘున్నారు.పిల్లలు కొంచం ఆడుకోవడానికి స్థలం, ప్రార్థన సమయానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు కలసి నిలబడడానికి స్థలం కోసం విచారిస్తున్నారు.

అందరూ కలసి శ్రీ గురుగోవింద స్వామి వారి మఠం ఎదురుగా వున్న స్థలాన్ని ఎంపిక చేశారు . మఠం కూడా విశాలమైన. ప్రాంగణం లోనే వుంది. శ్రీ గురుగోవింద స్వాముల వారిది జీవసమాధి. ఆమఠం ఆవరణలోనే శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం ఉంది. 16, 17 శతాబ్దాల మధ్య సోమనాథ క్షేత్రమునుండి తెచ్చిన సోమేశ్వరస్వామి లింగము ఇక్కడ ప్రతిష్ఠ గావింపబడింది. ఈ స్వామి వారి ఆలయంౘుట్టూ మరియూ శ్రీ గురుగోవింద స్వామి వారి యొక్క మఠం ౘుట్టూ మండలం (నలభై) రోజులు ప్రదక్షిణం గావించినచో సత్సంతాన ప్రాప్తి కల్గునని నమ్మకము. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో విశేష పూజలుగూడా జరుగుతాయి.

అయితే కాలక్రమేణ మఠం ఆవరణ జీర్ణావస్తకు చేరుకోవడం జరిగింది. మా పాఠశాల మఠం ఎదురుగా ప్రారంభించే నాటికి గోవింద స్వామి ఆలయం, సోమేశ్వరస్వామి ఆలయం కొంత ఉనికిని ౘాటుకుంటూనే ఉన్నాయి. వెనుక భాగాన పెద్ద కోనేరు , కోనేటినిండా నీళ్ళు, ప్రక్కనే పెద్ద తెల్ల గన్నేరు చెట్టు , కోనేటికి ఎడమ వైపున రెండు మూడు గదులు, వాటికి ముందు విశాలమైన స్థలం వుండేది. మాఘశుద్ధ త్రయోదశి నుండి, బ్రహ్మోత్సవాలు జరుగును. మాఘశుద్ద పౌర్ణమి రోజు గొప్ప సమారాధన అన్నదాన కార్యక్రమాలు ౙరుగుతూ ఉండేవి.

గురుగోవింద స్వామి వారి వంశీయులే ధర్మకర్తలుగా వుండేవారు. మేము పాఠశాలకు వెళ్ళే రోజుల్లో శ్రీవేంకటేశమయ్యగారు పూజాధికాలు నిర్వహించేవారు. అనేక కష్టాలలోకూడా వారు సేవ మానలేదు. వారిని ౘూస్తే ” కుచేలుడు ” గుర్తుకు వచ్చేవారు. జీవిత సాఫల్యాన్ని వెదుక్కొంటూ ఆ జీర్ణావస్త లో యున్న మఠాన్నే వారు ఆరాధిస్తూ వుండేవారు.

పలుగురాళ్ళపల్లె కు ౘుట్టుప్రక్కలా ఎక్కడా పదికిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాలలేదు వెళితే పోరుమామిళ్ల వెళ్ళాలి లేకుంటే బద్వేల్ వెళ్ళాలి. అందుకే చుట్టుప్రక్కల ఉన్న పల్లె ల నుండి పిల్లలు నడౘుకుంటూ పాఠశాలకు వచ్చేవారు. భాకరాపేట, కొత్తపల్లె, జౌకుపల్లె, ముడమాల, అమగంపల్లె, మల్లేపల్లి, మున్నెల్లి, కోడూరు, కొండకిందపల్లె, కొడిగుండ్లపాడు, బొగ్గులవారిపల్లె, కుంచెన్పల్లి, ఎర్రంపల్లె, స్వాదురవారిపల్లె, అమ్మవారిపేట, గుంతపల్లె, ఇలా అన్ని ఊర్లనుండి వచ్చేవారు. కొంతమంది పిల్లలు మా వూరిలో చిన్న రూము అద్దెకు తీసుకుని వండుకుతిని స్కూలుకు వెళ్ళేవారు.

శ్రీగురుగోవిందస్వామి వారి ” రథం ” ఉంౘటానికి మఠానికి ఎదురుగా ಓ ఎత్తైన గది ఉండేది. ఆగదికి ఇరువైపులా రెండు విశాలమైన సత్రాలు వుండేవి. పెద్దపెద్ద రాతి స్తంభాలతో , దూలాలతో కట్టినవి. ఆ రెండు సత్రాల వెనుక పెద్ద ఖాళీ స్థలం ఉండేది. ఈస్థలంలో పెద్దపెద్ద మామిడి చెట్లు వుండేవి. మట్ట మధ్యాహ్నం కూడా ఎండ పడకుండా వుండేటంత దట్టంగా మామిడి చెట్లు పెరిగి యుండేవి. మొదళ్ళు కూడా పెద్దగా, లావుగావుండి వాటి క్రింద అయిదు కొట్టాలు వేసినా ఒక్క కొమ్మ కూడా కొట్టాల్సిన అవసరం లేకుండా వుండేటంత పెద్దగా వుండేవి. సత్రం ముందుభాగం గోడ కట్టి , వెనుక భాగం తలుపు పెట్టి ఒక క్లాస్ రూము తయారు చేశారు. తరువాత ప్రహరీ గోడ వెంబడి అయిదు కొట్టాలు “L” ఆకారంలో విడివిడిగా వేశారు.